*రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఏమిటీ ప్రయోజనం?*
కోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత.
'కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే'.
*'శివ'* అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాదిదేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి.
*శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.*
ఈ శర్వాది అష్టమూర్తులే *పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞ, సూర్యచంద్రులను* అధిష్టించి ఉన్నాయి.
ఈ అష్టమూర్తులను ఆధారం చేసుకొని విశ్వమంతా వ్యాపించిన భగవంతుని సర్వతోభావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది.
“ఓం శర్వాయ క్షితిమూర్తయే నమ:
ఓం భవాయ జలమూర్తయే నమః
ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ:
ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః
ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః
ఓం పశుపతయే యజమానమూర్తయే నమః
ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమః
ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమః
*జీవుని దేహమే దేవాలయం. మాయావిముక్తుడైన జీవుడే సదాశివుడు.*
అజ్ఞానమనే నిర్మాల్యాన్ని విడిచి పెట్టి *"సో హం"* భావంతో సదాశివుని , పూజించాలి.
" దేహో దేవాలయః ప్రోక్తో జీహాదేవ సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్ "
'రుద్రో జనానాం హృదయే సన్నివిష్టః ప్రాణేష్యంతర్మనసో లింగమాహుః'
*హృదయంలో ఉన్నవాడు రుద్రాలింగశాబ్దవాచ్యుడైన శివుడిని శ్రుతులు చెబుతున్నాయి.*
అందుకే *మన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మలమైన మనస్సు నుండి వెలువడే శ్రద్దా నదీజలంతో మహాదేవుని అభిషేకించి, సమాథి పుష్పాలతో పూజించి, మోక్షాన్ని పొందాలి.*
బ్రహ్మచారులు యాజ్ఞవల్క్యుని చేరి *“ఏ మంత్రంచేత మనుష్యుడు మోక్షంపొందుతాడు?”* అని అడిగారు.
దానికాయన *"శతరుద్రీయేణేతి"* శతరుద్రీయంచేత
అన్నాడు.. అని జాబాలోపనిషత్తు చెపుతున్నది.
*'శతం రుద్రా దేవతా యస్య'*
నూరు మంది అంటే పెక్కుమంది రుద్రులు దేనికి దేవతలో అలాంటిది శతరుద్రీయం అని తైత్తరీయసంహిత చతుర్థకాండ పంచమ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటున్నది.
మాయాంతు ప్రకృతిం విద్యాత్
మాయినం తు మహేశ్వరమ్' (శ్వేతా.ఉ)
*మాయ అంటే ప్రకృతి. దానికి అధిపతి మహేశ్వరుడు. అందుకే ప్రకృతిలోని అనంతమైన శివశక్తిని శివపూజతో, భజనతో, శ్రవణాదికాలతో మేల్కొల్పాలి.*
*తానే శివుడై సర్వాన్ని శివమయంగా భావించి తాదాత్మ్యం చెందాలి.*
అదే శివపూజలోని ఆంతర్యం.
*అప్పుడు శివపూజలో సాయుజ్యం, శివభజనలో సామీప్యం, శివుని విషయాలను ప్రసంగించడంలో, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని ఆదిశంకరుల ఉపదేశం.*
శివుని ధారాపూర్వకంగా చల్లని నీటితో అభిషేకం చేయడం
యోగ శాస్త్రరీత్యా మన సహస్రార కమలంలో ప్రకాశించే సదాశివతత్యామృతం వర్షించడానికి ఒక ప్రతీక.
'సర్వయజ్ఞ తపోదాన తీర్థదేశేషు యత్సలం
తత్పలం కోటిగుణితం శివలింగార్చనాత్సలం'.
*"అన్ని యజ్ఞాలవల్ల, తపస్సులవల్ల, దానాలవల్ల, తీర్థాలను సందర్శించడంవల్ల కలిగే ఫలానికి కోటి రెట్లు శివలింగార్చనవల్ల కలుగుతుందని పెద్దలంటారు.*
ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు.
రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించ కూడదు ('నారుద్రో రుద్రమర్చయేత్) ముందుగా మహాన్యాసంతో ఆ యోగ్యతను సంపాదించుకొని, తరవాత ఆయనను నమక చమక పారాయణతో అభిషేకిస్తాం.
*ఏకాదశరుద్రాభిషేకం చేస్తాం. మన జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనస్సు కలిపి పదకొండు. అదే ఏకాదశ రుద్రాభిషేకంలోని అంతరార్థం.*
అంతే కాదు. *మనలో ప్రాణాపానాది ఐదు వాయువులూ, నాగకూర్మాది ఐదు ఉపవాయువులూ ఉన్నాయి. ఈ పదింటికీ మూలమైనది ఆత్మ. దాంతో పదకొండు. ఇవే ఏకాదశరుద్ర స్వరూపం*
రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఇవన్ని శుద్ధమవుతాయి.🙏🏻
No comments:
Post a Comment