Tuesday, November 26, 2024

శివతత్త్వం

 *👉 శివతత్త్వం తెలుసుకుంటే శివుడు ప్రత్యక్షమవుతాడు 🙏*


శ్లో// *ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//*


(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ 

ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను. మరల మరల నమస్కరిస్తున్నాను).                 

    

*పవిత్ర కార్తీక మాసంలో స్కాందపురాణంలో వివరించిన శివతత్త్వం విచారణ చేద్దాం*


పార్వతీదేవి శివుని భర్తగా వరించి తపస్సు చేస్తున్నది.

ఆమెకు శివతత్త్వం అర్థమైందా లేదా అని పరీక్షించడానికి శివుడు బ్రహ్మచారి రూపంలో ఆమె తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు.


సఖులచేత పరివేష్టింపబడి,చంద్రకాంతి లాగా వెలిగిపోతూ తపో దీక్షలో ఉన్న పార్వతీదేవిని చూశాడు.


శివుని భర్తగా కోరి, పార్వతి తపస్సు చేస్తున్నదని చెలికత్తెలు చెప్పగా, హేళనగా నవ్వి, పార్వతితో ఇలా అన్నాడు :


" శివుని పుట్టుపూర్వములు, గోత్రము మొదలైనవి ఎవరికీ తెలియవు.


శ్మశానాల్లో, శవముల బూడిద పూసుకుని, భూత, ప్రేత, పిశాచాలతో తిరిగే అమంగళుడు శివుడు.నీకు సరైన వరుడు కాడు. అందువల్ల నీ తపస్సు యుక్తమైనది కాదు. 

వెంటనే ఈ ప్రయత్నమునుండి విరమించుము " అన్నాడు.


ఆ బ్రహ్మచారి పలుకులకు కోపించిన పార్వతీ దేవి, కంఠము గద్గదమవగా అతనికి ఇట్లు బదులు చెప్పెను.


" ఓ బ్రాహ్మణా! శంకరుని విషయంలో విరుద్ధముగా మాటలాడకుము.


దేవదేవుని నిందించిన వాడు మహత్తరమైన"తమస్సు"లో ( *అజ్ఞానమనే చీకటిలో* ) మునిగిపోతాడు.


నీకు ఆ దేవుని తత్త్వం తెలియదు. 


ఆ మహాదేవుని దూషించిన పాపం పోయేటందుకు ఆయన తత్వమును శ్రవణము చేయుము. 


శివుని పుట్టుపూర్వములు, గోత్రము మొదలైనవి ఎవరికీ తెలియవు అన్నావు!


శ్లో// *స ఆదిః సర్వ జగతాం కోస్య వేదాన్వయం తతః/*

*సర్వం జగద్యస్య రూపం దిగ్వాసాః కీర్త్యతే తతః//*


( సకల జగత్తుయొక్క ఉత్పత్తికి కారణమైన ఆ పరమశివుని ఉత్పత్తిని, ఆయన వంశమును ఎవరు తెలుసుకొనగలరు ?)


( *ఈ జగత్తంతా శివుని రూపమే. దిక్కులే అతని వస్త్రములు. కనుకనే ఈశ్వరుని "దిగంబరుడు" అంటారు* ).


శ్లో// *గుణత్రయమయం శూలం,శూలీ యస్మాద్భిభర్తి సః/*

*అబద్ధాః సర్వతో ముక్తా భూతా ఏవచ తత్పతిః//*


సత్త్వ,రజ, స్తమము‌లనబడే త్రిగుణములే త్రిశూలం.

దానిని ధరించడం అంటే ఆ త్రిగుణములతో కూడిన మాయను తన అధీనములో ఉంచుకోవడం. అందువల్ల ఆ పరమశివుని " శూలీ " అనిపిలుస్తారు.


సంసారంలో బంధింపబడ్డవాడు జీవుడు.

బంధము లేనివాడు ముక్తుడు.

జీవులను సంసార బంధములనుండి విడిపించి ముక్తిని ప్రసాదిస్తాడు శివుడు.


( *"త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం/*

*ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్"* అని వేదమంత్రం)


ఆయన ముక్త జీవులకు కూడా పతి ( *ముక్తానాం పరమా గతిః* )


శ్లో// *శ్మశానం చాపి సంసార స్తద్వాసి,కృపయార్థినామ్/*

*భూతయః కథితా భూతి స్తాం బిభర్తే స భూతిభృత్//*


(శ్మశానమనగా జనన మరణ చక్రములో పరిభ్రమించేది, దుఃఖ భూయిష్టమైనది, నిస్సారమైనది అయిన ఈ సంసారమే.


అర్థిజనులమీది దయతో శివుడు ఆ సంసారాన్ని ఆశ్రయించి ఆర్తులను రక్షిస్తూ ఉంటాడు.


భ్రమాత్మకమైన ఈ సంసారం ఎప్పటికైనా నశించేదే అనే వైరాగ్య సూచకమే శివుని శ్మశాన సంచారం.


సృష్టి, స్థితి, లయములనబడే విభూతులను కలిగియున్నందున శివుడు భూతిభృత్తనబడును).

                         

శ్లో// *వృ‌షో ధర్మ ఇతి ప్రోక్త స్తమారూఢ స్తతో వృషీ/*

*సర్పాశ్చ దోషాః క్రోధాద్యా స్తాన్ బిభర్తి జగన్మయః//*


 *వృష మనగా ధర్మము*


దానినధిరోహించుట వలన శివుడు "వృషీ"యనబడును. ఆ కారణం వల్లనే *వృషభ వాహనుడు, వృషభ ధ్వజుడు* అని శివుడు కీర్తింప బడుతాడు. *క్రోధము, లోభము, ఈర్ష్యా ద్వేషములు* మున్నగు దుర్గుణములు సర్పములనబడును. 

వాటిని ధరించి తన స్వాధీనములో ఉంచుకొంటాడు, కాబట్టి శివుని సర్పభూషణుడు,నాగభూషణుడు అంటారు.


శ్లో// *నానావిధాః కర్మయోగా జటారూపా బిభర్తి సః/*

*వేదత్రయీ త్రినేత్రాణి త్రిపురం త్రిగుణంవపుః//*


శ్లో// *భస్మీకరోతి తద్దేవ స్త్రిపురఘ్న స్తతః స్మృతః/*

*ఏవం విధం మహాదేవం విదుర్యేసూక్ష్మదర్శినః//*


 నానావిధములైన కర్మయోగములే జటలు. 

అట్టి జటలు ధరిస్తాడు కాబట్టి "జటీ" అని పిలువబడుతాడు.


*మూడు వేదములు ఆయన నేత్రములు.*

*అందువల్ల ఆయనను త్రినేత్రుడు అంటారు.*


*సత్వ, రజ, స్తమో గుణములు, అనబడే త్రిపురములే శరీరము*.


త్రిగుణాత్మక మైన శరీరమును భస్మము చేసి నిర్గుణ పరబ్రహ్మను పొందిస్తాడు కాబట్టి శివుని "త్రిపురఘ్నుడు" "పురారి" అని పిలుస్తారు. దానికి చిహ్నమే శివుడు భస్మము ధరించుట


కేవలము సూక్ష్మబుద్ధి కలవారే ఆ మహాదేవుడు ఇట్టి వాడని తెలియగలరు).


" నీవు కూడా ఈ శివుని బాగుగా పూజింపుము",

అని ఆ వటునితో చెప్పింది పార్వతీ దేవి.


ఆ బ్రహ్మచారి మరల పెదవిని కదల్చుటను చూచింది.

వెంటనే తన సఖితో,


 " ఈ బ్రహ్మచారి ఏదో చెప్పబోతున్నాడు. ఇతనిని వారించండి. మహాత్ములను నిందించే వాడే గాక,ఆ నిందను విన్నవాడు కూడా పాపమును పొందుతాడు.


ఇతనితో వాదించి మనకేమి ప్రయోజనం?

చెవులు మూసుకుని వెళ్ళిపోదాము "


అని పలికి పార్వతి చెవులు మూసుకుని, లేచి, వెళ్ళిపోబోతున్నది. 


వెంటనే శివుడు బ్రహ్మచారి రూపమును వీడి చిరునవ్వు నవ్వుతూ స్వస్వరూపమును ధరించాడు.


శ్లో// *ద్విభుజం చైకవక్త్రం చ కృత్తివాసస మద్భుతమ్/*

*కపర్దం,చంద్రరేఖాంకం,నివీతం గజచర్మణా//*


(పంచ వక్త్రుడైన శివుడు ఒక ముఖంతో సాక్షాత్కరించాడు.

రెండు భుజములతోను, శిరస్సు మీద చంద్ర, రేఖతోను, 

జటాజూటముతోను కూడి, గజచర్మమును యజ్ఞోపవీతముగా ధరించిఉన్న ఆ శివుడు అద్భుతమైనతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు).


శ్లో// *కర్ణస్థౌ హి మహానాగౌ కంబలాశ్వతరౌ తదా/*

*వాసుకిః సర్పరాజశ్చ కృతాహారో మహాద్యుతిః//*


(కంబల,అశ్వతరములనే మహానాగములు ఆయన కర్ణాభరణములుగా ఉన్నవి.

సర్పరాజైన వాసుకి హారముగా ఉన్నాడు.

ఆ శివుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు).


శ్లో// *వలయాని మహార్హాణి తదా సర్పమయానిచ/*

*కృతాని తేన రుద్రేణ తథా శోభాకరాణి చ//*


(శోభను కలిగించు గొప్ప సర్పముల వలయములను శివుడు అప్పుడు ధరించి ఉన్నాడు).


ఆ విధమైన దివ్యరూపంతో శివుడు, *శివతత్త్వం సంపూర్ణంగా గ్రహించిన పార్వతీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు.* 


 *శుభమస్తు* .


 🙏

No comments: